దిస్‌పూర్: అస్సాం గడ్డపై ఒక్క అక్రమ వలసదారుడు కూడా ఉండటానికి వీల్లేదని, పట్టుబడిన ప్రతి చొరబాటుదారుడిని దేశం బయటకు పంపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. గత పదేండ్లలో అస్సాంలోకి చొరబాటుదార్లు రాకుండా బీజేపీ అడ్డుకుందని, అయితే, అది మాత్రమే సరిపోదని.. రాబోయే ఐదేండ్లలో ప్రతీ ఒక్క చొరబాటుదారుడిని వెనక్కి పంపడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు ఆదివారం సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకియాజులిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
అక్రమ వలసదారులు స్థానిక అస్సామీ యువత ఉద్యోగాలను లాగేసుకున్నారని, పేదల నోటి కాడి కూడును దోచుకున్నారని మండిపడ్డారు. సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఇప్పటికే 1.25 లక్షల ఎకరాల ఆక్రమిత భూమిని చొరబాటుదారుల నుండి విడిపించిందని, వచ్చే ఐదేండ్లలో ఒక్క అంగుళం భూమి కూడా వారి ఆధీనంలో ఉండకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
చొరబాటుదారులను రక్షించేందుకే రాహుల్ గాంధీ అండ్ కో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ను వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ కూడా చొరబాటుదారుల పక్షాన నిలబడాలని చూస్తున్నారని విమర్శించారు.
